1 యేసు ఒలీవలకొండకు వెళ్లెను. 2 తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోకి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. 3 శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొవచ్చి ఆమెను మధ్యనిలువబెట్టి 4 -బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారముచేయుచుండగా పట్టబడెను; 5 అట్టివారిని రాళ్లు రువ్విచంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి 6 ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో (ఏమో) వ్రాయుచుండెను. 7 వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి -మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి 8 మరల వంగి నేలమీద వ్రాయుచుండెను 9 వారామాట విని, 1పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకనివెంట ఒకడు బయటికి వెళ్లిరి యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడి యుండెను. 10 యేసు తలయెత్తి చూచి - అమ్మా, వారెక్కడనున్నారు?; ఎవడును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు 11 ఆమె - లేదు ప్రభువా అనెను. అందుకు యేసు - నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్లి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. 12 మరియు యేసు - నేను లోకమునకు వెలుగునైయున్నాను; నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలవాడై యుండునని వారితో చెప్పెను. 13 కాబట్టి పరిసయ్యులు - నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా 14 యేసు - నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే, నేను ఎక్కడినుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు. 15 మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవనికిని తీర్పు తీర్చను. 16 నేను ఒక్కడనైయుండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడనున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. 17 మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా. 18 నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యనిచ్చుచున్నాడని చెప్పెను. 19 వారు - నీ తండ్రి యెక్కడనున్నాడని ఆయనను అడుగగా యేసు - మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగియుంటిరా నా తండ్రినికూడ ఎరిగియుందురని వారితో చెప్పెను. 20 ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింక రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. 21 మరియొకప్పడు ఆయన -నేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనేయుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. 22 అందుకు యూదులు - నేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పచున్నాడే; తన్నుతానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. 23 అప్పుడాయన - మీరు క్రిందివారు, నేను పైనుండువాడను, మీరు ఈ లోకసంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను. 24 కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించినయెడల మీరు మీ పాపములలోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను. 25 కాబట్టి వారు - నీవెవడవని ఆయన నడుగగా యేసు వారితో - మొదటినుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. 26 మిమ్మనుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును అనేక సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. 27 తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. 28 కావున యేసు -మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియుచేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. 29 నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయువాడను గనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదని చెప్పెను. 30 ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి. 31 కాబట్టి యేసు తనయందు విశ్వాసముంచిన యూదులతో -మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యము గ్రహించెదరు; 32 ఆప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా 33 వారు - మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమైయుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. 34 అందుకు యేసు - పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 35 దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారుడెల్లప్పుడును నివాసముచేయును. 36 కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. 37 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుకు నన్ను చంప వెదుకుచున్నారు. 38 నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆ ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. 39 అందుకు వారు ఆయనతో - మా తండ్రి ఆబ్రాహామనిరి; యేసు - మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. 40 దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్నుమీరిప్పుడు చంప వెదుకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు. 41 మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు - మేము వ్యభిచారమువలన పుట్టినవారముకాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా 42 యేసు వారితో ఇట్లనెను- దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్నుపంపెను. 43 మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననే గదా? 44 మీరు మీ తండ్రియగు అపవాది 1సంబంధులు, మీ తండ్రి దరాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు. 45 నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్నునమ్మరు. 46 నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్ధాపించును? నేను సత్యము చెప్పుచున్న పక్షమున మీరెందుకు నన్ను నమ్మరు? 47 దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. 48 అందుకు యూదులు - నీవు సమరైయుడవును దయ్యము పట్టినవాడవునై యున్నావని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా. 49 యేసు - నేను దయ్యము పట్టినవాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు. 50 నేను నా మహిమను వెదకుటలేదు, వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. 51 ఒకడు నా మాటగైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడనిమీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. 52 అందుకు యూదులు -నీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగుదుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను - ఒకడు నా మాటగైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు. 53 మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్నునీ వెవడనని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి. 54 అందుకు యేసు -నన్ను నేనే మహిమపరుచుకొనినయెడల నా మహిమ వట్టిది; - మా దేవుడని మీరెవనిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. 55 మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగదును, ఆయన మాట గైకొనుచున్నాను. 56 మీ తండ్రియైన అబ్రాహాము నా దినముచూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను, అందుకు యూదులు - నీకింక ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, 57 యేసు - అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 58 కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లను ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను. 59 కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లను ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను. Download Audio File
1 ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. 2 ఆయన శిష్యులు - భోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసేను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా 3 యేసు - వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదుగాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. 4 పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. 5 నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగైయున్నానని చెప్పెను. 6 ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురదపూసి 7 -నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమును మాటకు పంపబడినవాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. 8 కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారును - వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనువాడు కాడా అనిరి. 9 వీడే అని కొందరును; వీడు కాడు, వీని పోలియున్నయొకడని మరికొందరును అనిరి; వాడైతే - నేనేయనెను. 10 వారు - నీ కన్నులేలాగు తెరువబడెనని వానినడుగగా 11 వాడు - యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి - నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను. 12 వారు - ఆయన ఎక్కడనని అడుగగా వాడు - నేనెరుగననెను. 13 అంతకుముందు గ్రుడ్డియై యుండినవానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసికొనిపోయిరి. 14 యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము 15 వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులుకూడ వానిని మరల అడుగగా వాడు - నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను. 16 కాగా పరిసయ్యులలో కొందరు - ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరిచుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు - పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియలేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను. 17 కాబట్టి వారు ఆ గుడ్డివానితో - అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమనుకొనుచున్నావని యడుగగా వాడు - ఆయన ఒక ప్రవక్త అనెను. 18 వాడు గ్రుడ్డివాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి, 19 గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి. 20 అందుకు వాని తలిదండ్రులు - వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. 21 ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. 22 వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; యెందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలివేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొనియుండిరి. 23 కావున వాని తలిదండ్రులు - వాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి. 24 కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి - దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా 25 వాడు - ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాననెను. 26 అందుకు వారు - ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా 27 వాడు - ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను. 28 అందుకు వారు - నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము; 29 దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడినుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి. 30 అందుకు ఆ మనుష్యుడు - ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను. 31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును. 32 పుట్టు గుడ్డివాని కన్నులెవడైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. 33 ఈయన దేవునియొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను. 34 అందుకు వారు - నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. 35 (పరిసయ్యులు) వానిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని - నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. 36 అందుకు వాడు - ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా 37 యేసు -నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. 38 అంతట వాడు - ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. 39 అప్పుడు యేసు - చూడనివారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను, అను తీర్పునిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను. 40 ఆయనయొద్దనున్న పరసయ్యులలో కొందరు ఈ మాట విని - మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. 41 అందుకు యేసు - మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవునుగాని - చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొను చున్నారు గనుక మీ పాపము నిలిచి యున్నదని చెప్పెను. Download Audio File
1 గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు. 2 ద్వారమున ప్రవేశించువాడు గొర్రెలకాపరి. 3 అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని శబ్దము వినును, అతడు స్వకీయమైన గొర్రెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలపలికి నడిపించును. 4 మరియు అతడు స్వకీయమైన గొర్రెలనన్నిటిని వెలపలికి నడిపించునప్పుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొర్రెలు అతని శబ్దమెరుగును గనుక అవి అతని వెంబడించును. 5 అన్యుల శబ్దము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాని వారితో అనెను. 6 ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. 7 కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను 8 - గోర్రెలు పోవు ద్వారము నేనే : నాకు ముందు వచ్చినవారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొర్రెలు వారి శబ్దము వినలేదు. 9 నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. 10 దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 11 నేను గొర్రెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొర్రెలకొరకు తన ప్రాణము పెట్టును. 12 జీతగాడు గొర్రెల కాపరికాడు గనుక గొర్రెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును; తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. 13 జీతగాడు జీతగాడే గనుక గొర్రెలునుగూర్చి లక్ష్యముచేయక పారిపోవును. 14-15. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 16 ఈ దొడ్డివికాని వేరే గొర్రెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా శబ్దమువినును, అప్పుడు మంద యొక్కటియు గొర్రెల కాపరి యొక్కడును అగును. 17 నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18 ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. 19 ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను. 20 వారిలో అనేకులు - వాడు దయ్యము పట్టినవాడు వెర్రివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. 21 మరికొందరు - ఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గుడ్డివారి కన్నులు తెరువగలదా అని చెప్పిరి. 22 ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను. 23 అది శీతకాలము అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా 24 యూదులు ఆయనచుట్టు పొగై - యెంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. 25 అందుకు యేసు -మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు; నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 26 అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు. 27 నా గొర్రెలు నా శబ్దము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. 28 నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. 29 వాటిని నాకిచ్చిన నా తండ్రిచేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు; 30 నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను. 31 యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లు చేత పట్టుకొనగా 32 యేసు - తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. 33 అందుకు యూదులు - నీవు మనుష్యుడవైయుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. 34 అందుకు యేసు - మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? 35 లేఖనము నిరర్థకము కానేరదు గదా; దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల - నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, 36 తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోకి పంపినవానితో - నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? 37 నేను నా తండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి, 38 చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. 39 వారు మరల ఆయనను పట్టుకొన చూచిరిగాని ఆయన వారి చేతినుండి తప్పించుకొనిపోయెను. 40 యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను. 41 అనేకులు ఆయనయొద్దకు వచ్చి - యోహాను ఏ సూచకక్రియను చేయలేదు గాని యీయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైనవనిరి. 42 అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. Download Audio File
1 మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగియాయెను. 2 ఈ లాజరు ప్రభువుకు అత్తరు వూసి తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. 3 అతని అక్కచెల్లెండ్లు - ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి. 4 యేసు అది విని - యీ వ్యాధి మరణార్థమై వచ్చినది కాదు గాని దేవుని కూమారుడు దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమార్థమై వచ్చినదనెను. 5 యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. 6 అతడు రోగియైయున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండుదిములు నిలిచెను. 7 అటుపిమ్మట ఆయన - మనము యూదైయకు తిరిగి వెళ్లుదుమని తన శిష్యులతో చెప్పగా 8 ఆయన శిష్యులు - బోధకుడా, యిప్పుడే యూదులు నిన్నురాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి. 9 అందుకు యేసు - పగలు పన్నెండు గంటలున్నవి గదా; ఒకడు పగటివేళ నడిచినయెడల ఈ లోకపు వెలుగును చూచును గనుగ తొట్రుపడడు. 10 అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. 11 ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత - మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా 12 శిష్యులు - ప్రభువా, అదడు నిద్రించినయెడల బాగుపడుననిరి. 13 యేసు అతని మరణమును గూర్చి చెప్పెనను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. 14 -15. కావున యేసు - లాజరు చనిపొయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదుము రండని స్పష్టముగా వారితో చెప్పెను. 16 అందుకు దిదుమ అనబడిన తోమా - ఆయనతో కూడ చనిపొవుటకు మనమును వెళ్లుదమని తనతోటి శిష్యులతో చెప్పెను. 17 యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను. 18 బేతనియ యెరూషలేముకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము 19 గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను పరామర్శించుటకై వారియొద్దకు వచ్చియుండిరి. 20 మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్లెను గాని మరియు యింటిలో కూర్చుండియుండెను. 21 మార్త యేసును చూచి - ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. 22 ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని యెరుగుదుననెను. 23 యేసు - నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా 24 మార్త ఆయనను చూచి - అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను. 25 అందుకు యేసు -నేనే పునరుత్థానమును జీవమునై యున్నాను; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; 26 బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెనడిగెను. 27 , ఆమె - అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్మచున్నానని ఆయనతో చెప్పెను. 28 ఆమె యీ మాట చెప్పి వెళ్లి తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను. 29 ఆమె విని త్వరగా లేచి ఆయనయొద్దకు వచ్చెను. 30 యేసు ఇంక ఆ గ్రామములోకి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనేయుండెను 31 గనుక యింటిలో మరియతో కూడనుండి ఆమెను పరామర్శంచుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి. 32 అంతట మరియ యేసు ఉన్నచోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదములమీద పడి - ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను. 33 ఆమె యేడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు - అతని నెక్కడనుంచితిరని అడుగగా, 34 వారు - ప్రభువా, వచ్చిచూడుమని ఆయనతో చెప్పిరి. 35 యేసు కన్నీళ్లు విడిచెను. 36 కాబట్టి యూదులు - అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. 37 వారిలో కొందరు - ఆ గుడ్డివాని కన్నులు తెరచినవాడైన యీయన యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి. 38 యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. 39 యేసు - రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త - ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. 40 అందుకు యేసు - నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; 41 అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి - తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 42 నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారినిమిత్తమై యీ మాట చెప్పితిననెను. 43 ఆయన ఆలాగు చెప్పి - లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా 44 చనిపోయినవాడు కాళ్లు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడినవాడై వెలిపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు - మీరు అతిని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను. 45 మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి కాని 46 వారిలో కొందరు పరిసయ్యులయొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. 47 కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చి - మనమేమి చేయుచున్నాము? ఈ మనష్యుడు అనేకమైన సూచకక్రియలు చేయుచున్నాడే 48 మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులువచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. 49 అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై యుండి - మీకేమియు తెలియదు. 50 (మన) జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. 51 తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక 52 యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకుమాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను. 53 కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి. 54 కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడినుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతోకూడ నుండెను. 55 మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలోనుండి యెరుషలేముకు వచ్చిరి. 56 వారు యేసును వెదుకుచు దేవాలయములో నిలువబడి - మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. 57 ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న పక్షమున తాము ఆయనను పట్టుకొనగలందులకై తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి. Download Audio File
1 మృతులలోనుండి యేసుచేత లేపబడిన లాజరు ఉన్న బేతనియకు యేసు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకొరకు విందు చేసిరి. 2 మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతోకూడ భోజనమునకు కూర్చున్నవారిలో ఒకడు. 3 అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నరయెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. 4 ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా 5 - యీ అత్తరెందుకు మున్నూరు దేనారములుకు అమ్మిబీదలకు ఇయ్యలేదనెను. 6 వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచి యుంచుకొని ఆందులో వేయబడినది ఎత్తికొని పోవుచువచ్చెను గనుక ఆలాగు చెప్పెను. 7 కాబ్బట్టి యేసు - నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి; 8 బీదలు ఎల్లప్పుడును మీతో కూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను. 9 యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి లేపిన లాజరునుకూడ చూడవచ్చిరి. 10-11. అతని చూచిన యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధానయాజకులు లాజరునుకూడ చంపనాలోచనచేసిరి. 12 మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని 13 ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి - జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని కేకలువేసిరి. 14 - సీయోను కుమారీ భయపడకుము, ఇదిగో నీ రాజు 15 గాడిదె పిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడుఅని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదెను కనుగొని దానిమీద కూర్చుండెను. 16 ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయననుగూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. 17 ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలోనుండి అతని లేపినప్పుడు ఆయనతోకూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. 18 అందుచేత ఆయన ఆ సూచకక్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. 19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు - మన ప్రయత్నములెట్లు నిష్ ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి. 20 ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు హెల్లెనీయులుండిరి. 21 వారు గలిలైయలోని బేత్సయిదావాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి - అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా 22 ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. 23 అందుకు యేసు వారితో ఇట్లనెను - మనుష్యకుమారుడు మహిమపొందవలసిన గడియ వచ్చియున్నది. 24 గోధుమగింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగనేయుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును. 25 తన ప్రాణమును ప్రేమించువాడు దాని నశింపజేయువాడు; ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవార్థమై దాని కాపాడువాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26 ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించియెడల నా తండ్రి అతని ఘనపరచును. 27 ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును? - తండ్రీ, యీ గడియ నాకు తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని; 28 తండ్రీ, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట - నేను దాని మహిమపరచితిని, మరల మహిమపరతును అను నొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. 29 కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము - ఉరిమెను అనిరి. మరికొందరు - దేవదూత యొకడు ఆయనతో మాటలాడెననిరి. 30 అందుకు యేసు - ఈ శబ్దము నాకొరకు రాలేదు మీకొరకే వచ్చెను. 31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది; ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు తోసివేయబడును; 32 నేను భూమిమీదనుండి పైకెత్తబడినప్పుడు అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. 33 తాను ఏ విధముగా మరణము పొందవలసియుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. 34 జనసమూహము - క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. - మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్యకుమారుడగు ఈయన ఎవడని ఆయన నడిగిరి. 35 అందుకు యేసు - ఇంక కొంతకాలము వెలుగు మీమధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు కలిగియున్న వెలుగు కొలది నడువుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు. 36 మీరు వెలుగు సంబంధులగునట్లుమీకు కలిగియున్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. 37 యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారియెదుట ఇన్ని సూచకక్రియలుచేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి. 38 - ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువుయొక్కబాహువు ఎవనికి బయలు పరచబడెను?అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. 39-40. ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా -వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొనినావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వముకలుగజేసి వారి హృదయము కఠినపరచెను 41 అని యెషయా మరియొక చోట చెప్పెను. 1యెషయా ఆయన మహిమను చూచినందునఆయననుగూర్చి బోధించుచు ఈ మాటలు చెప్పెను. 42 అధికారులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి గాని సమాజములోనుండి వెలివేయబడుదుమేమోయని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. 43 వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. 44 అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను - నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. 45 నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు. 46 నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. 47 ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన పక్షమున నేనతనికి తీర్పు తీర్చను; నేను లోకమును రక్షించుటకే వచ్చితినిగాని లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. 48 నన్ను నిరాకనించి నా మాటలను అంగీకరింపనివానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. 49 ఏలయనగా నాయంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ ఇచ్చియున్నాడు. 50 మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెను. Download Audio File
1 తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకుముందే యెరిగినవాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి వారిని సంపూర్ణముగాప్రేమించెను. 2 వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాదియింతకుముందు ఆలోచన పుట్టించి యుండెను గనుక 3 తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసియున్నదనియు యేసు ఎరిగి 4 భోజనపంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుముకు కట్టుకొనెను. 5 అంతట పళ్లెములో నీళ్లుపోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. 6 ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు - ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. 7 అందుకు యేసు -నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా 8 పేతురు - నీవెన్నడును నా పాదములు కడుగరాదని అయనతో అనెను. అందుకు యేసు - నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను. 9 సీమోను పేతురు - ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను. 10 యేసు అతని చూచి - స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పనిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను. 11 తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక - మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను. 12 వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత ఆయన మరల కూర్చుండి - నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? 13 బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను మీకు బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. 14 కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరు ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. 15 నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. 16 దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, అపొస్తలుడుతన్ను పంపినవానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 17 ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు. 18 మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును కాని- నాతోకూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తెనుఅను లేఖనము నెరవేరుటకై (యీలాగు జరుగును. ) 19 జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగకమునుపు మీతో చెప్పుచున్నాను. 20 నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 21 యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి - మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను 22 ఆయన ఎవనిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులుసందేహపడుచు ఒకరితట్టు ఒకరు చూచుకొనుచుండగా 23 ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను 24 గనుక ఎవనిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగచేసెను. 25 అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు - ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. 26 అందుకు యేసు -నేనొక ముక్క ముంచి యెవనికిచ్చెదనో వాడే అని చెప్పి, యొక ముక్కముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను; 27 వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు - నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా 28 ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు. 29 డబ్బుసంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటిని కొనుమనియైనను, బీదలకేమైన ఇమ్మనియైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి. 30 వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ. 31 వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను - ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవుడును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు. 32 దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును. 33 పిల్లలారా, యింక కొంతకాలము మీతోకూడ ఉందును; మీరు నన్ను వెదుకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను. 34 మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్తఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకని నొకడు ప్రేమింపవలెను. 35 మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను. 36 సీమోను పేతురు - ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావని ఆయనను అడుగగా యేసు - నేను వెళ్లుచున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని యిటుతరువాత వచ్చెదవని అతనితో చెప్పెను. 37 అందుకు పేతురు - ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంటరాలేను? నీకొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా 38 యేసు - నాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. Download Audio File
1 మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి. 2 నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. 3 నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినప్పుడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును. 4 నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము ఏదో మీకు తెలియునని చెప్పెను. 5 అందుకు తోమా - ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదు; ఆ మార్గమేలాగు తెలియునని ఆయననడుగగా 6 యేసు -నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను; నాద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు. 7 మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మిరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను. 8 అప్పుడు ఫిలిప్పు - ప్రభువా, తండ్రిని మాకుకనుపరుచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా 9 యేసు -ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? 10 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను చెప్పుట లేదు; తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు. 11 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. 12 నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను 13 మీరు నా నామమునుబట్టి దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిచేతును. 14 నా నామమునుబట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును. 15 మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు. 16 నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, 2అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. 17 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును. 18 మిమ్మును అనాధలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; 19 అయితే మీరు నన్ను చూతురు. నేను బ్రదుకుచున్నాను గనుక మీరును బ్రదుకుదురు. 20 నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. 21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వాని ప్రేమించి వానికి నన్ను ప్రత్యక్షపరచుకొందునని చెప్పెను. 22 ఇస్కరియోతు కాని యూదా - ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్షపరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా 23 యేసు - ఒకడు నన్ను ప్రేమించువాడైతే నా మాటగైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానియొద్ద నివాసము చేతుము. 24 నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నా మాటకాదు, నన్నుపంపిన తండ్రిదే. 25 నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని. 26 ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మసమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. 27 సమాధానము మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా సమాధానము మీకనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. 28 నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు. 29 ఈ సంగతి సంభవించినప్పుడు, మీరు నమ్మవలెనని అది సంభవింపకమునుపే మీతో చెప్పుచున్నాను. 30 ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమియు లేదు. 31 అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను. లెండి యిక్కడినుండి వెళ్లుదము. Download Audio File