Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Saturday, July 27, 2013

యోహాను19వఅధ్యాయము

1  అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. 
2  రాణువవారు ముండ్లతో కిరీటము నల్లి అయన తలమీద పెట్టి 
3  ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి - యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. 
4  పిలాతు మరల వెలుపలికి వచ్చి - ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియగలందులకు ఈయనను మీయొద్దకు వెలపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను. 
5  ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలపలికి రాగా పిలాతు - ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. 
6  ప్రధానయాజకులును బంట్రౌతులును ఆయనను చూచి - సిలువవేయుడి సిలువవేయుడి అని కేకలువేయగా పిలాతు - ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను. 
7  అందుకు యూదులు - మాకొక నియమము కలదు; తాను దేవుని కూమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. 
8  పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి 
9  - నీ వెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు 
10  గనుక పిలాతు - నాతో మాటలాడవా? నిన్ను విడుదలచేయుటకు నాకు అధికారము కలదనియు, నన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అనెను. 
11  అందుకు యేసు - పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. 
12  ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదలచేయుటకు యత్నముచేసెను గాని యూదులు - నీవు ఇతని విడుదలచేసితివా కైసరుకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరుకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలు వేసిరి. 
13  పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీభాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. 
14  ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు మధ్యహ్నము కావచ్చెను. అతడు - ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా 
15  అందుకు వారు - ఇతని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలువేసిరి. పిలాతు - మీ రాజును సిలువవేయుదునా అని వారిని అడుగగా ప్రధానయాజకులు - కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. 
16  అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. 
17  వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. 
18  అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి, ఆయనతో కూడ ఇద్దరిని సిలువవేసిరి. 
19  మరియు పిలాతు - యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను. 
20  యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై యుండెను, అది హెబ్రీ హెల్లేని రోమాయి భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. 
21  - నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని - యూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధానయాజకులు పిలాతుతో చెప్పగా 
22  పిలాతు - నేను వ్రాసినదేమో వ్రాసితిననెను. 
23  రాణువవారు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్రములు తీసికొని, యొక్కొక రాణువవానికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీనికూడ తీసికొని, ఆ అంగీకుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక 
24  వారు - దాని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా పస్త్రములను తమలో పంచుకొని నా అంగీకోసరము చీట్లు వేసిరి అను లేఖనమునెరవేరునట్లు ఇది జరిగెను; ఇందుకే రాణువవారు ఈలాగు చేసిరి. 
25  ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్యయునైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి. 
26  యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి -అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను; 
27  తరువాత శిష్యుని చూచి - యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆగడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను. 
28  అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు - నేను దప్పిగొనుచున్నాననెను. 
29  చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టి యుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి. 
30  యేసు ఆ చిరక పుచ్చుకొని -సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 
31  ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినమున సిలువమీద ఉండకుండునట్లు వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. 
32  కాబట్టి రాణువవారు వచ్చి ఆయనతో కూడ సిలువవేయబడిన మొదటివాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి. 
33  వారు యేసు నొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొందియుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదుగాని 
34  రాణువవారిలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. 
35  ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు తాను సత్యము చెప్పుచున్నాడని అతడెరుగును. 
36  - అతని యెముకలలో ఒకటైనను విరువబడదుఅను లేఖనమునెరవేరునట్లు ఇవి జరిగెను. 
37  మరియు-తాము పొడిచినవానితట్టు చూతురుఅని మరియొక లేఖనముచెప్పుచున్నది. 
38  అటుతరువాత యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమితయియ యోసేపు తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతునొద్ద సెలవడుగగా పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను. 
39  మొదట రాత్రివేళ ఆయనయొద్దకు వచ్చిన నికొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్లయెత్తు తెచ్చెను. 
40  అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆసుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. 
41  ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడు ఎప్పుడు ఉంచబడని క్రొత్త సమాధి యొకటి యుండెను. 
42  ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. 
Download Audio File

No comments:

Post a Comment