Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Saturday, July 27, 2013

యోహాను20వఅధ్యాయము

1  ఆదివారమున ఇంక చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడలేచి సమాధియొద్దకు వచ్చి, సమాధిమీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను 
2  గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చి - ప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను. 
3  కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి. 
4  వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురుకంటె త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి 
5  వంగినారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. 
6  అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి 
7  నారబట్టలు పడియుండుటయు, అయన తల రుమాలు నారబట్టలయొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి యుండుటయు చూచెను. 
8  అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచినమ్మెను. 
9  ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. 
10  అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి. 
11  అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా 
12  తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. 
13  వారు - అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె - నా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. 
14  ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. 
15  యేసు - అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు, ఎవని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటవాడనుకొని - అయ్యా, నీవు ఆయనను మోసికొని పోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను. 
16  యేసు ఆమెను చూచి - మరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను చూచి, హెబ్రీభాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆమాటకు బోధకుడని అర్థము. 
17  యేసు ఆమెను చూచి - నేను ఇంక తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి - నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. 
18  మగ్దలేనే మరియ వచ్చి - నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. 
19  ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి - మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పెను. 
20  ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. 
21  అప్పుడు యేసు - మీకు సమాధానము కలుగుగాక; తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని మరల వారితో చెప్పెను. 
22  ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది - పరిశుద్ధాత్మను పొందుడి. 
23  మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. 
24  యేసు వచ్చినప్పుడు, పన్నెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను 
25  గనుక తక్కిన శిష్యులు - మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు - నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకులగురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 
26  ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపట ఉన్నప్పుడు తోమా వారితోకూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి -మీకు సమాధానము కలుగుగాక అనెను. 
27  తరువాత తోమాను చూచి - నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివైయుండుమనెను. 
28  అందుకు తోమా - నా ప్రభువా నా దేవా అనెను. 
29  యేసు - నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను. 
30  మరియు వేరు అనేకమైన సూచకక్రియలును యేసు తన శిష్యుల యెదుట చేసెను; అవి యీ గ్రంధమందు వ్రాయబడియుండలేదు గాని 
31  యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. 
Download Audio File

No comments:

Post a Comment