Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Saturday, July 27, 2013

యోహాను1వఅధ్యాయము

1  ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 
2  ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, 
3  కలియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. 
4  ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. 
5  ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. 
6  దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను. 
7  అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. 
8  అతడు ఆ వెలుగైయుండలేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. 
9  నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. 
10  ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికోనలేదు. 
11  ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 
12  తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 
13  వారు దేవుని వలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛలవలనైనను మానుష్యేచ్ఛలవలనైనను పుట్టినవారు కారు. 
14  ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారునిమహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 
15  యెహాను ఆయననుగుర్చి సాక్ష్యమిచ్చుచు- నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. 
16  ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. 
17  ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను; కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. 
18  ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయకుమారుడేఆయనను బయలుపరచెను. 
19  -నీవెవడవని అడుగుటకు యూదులు యెరుషలేమునుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. 
20  అతడు ఎరగననక ఒప్పుకొనెను; - క్రీస్తునుకానని యొప్పుకొనెను. 
21  కాగా వారు - మరి నీవెవడవు, నీవు ఏలీయావా అని అడుగగా - కాననెను. 
22  - నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా - కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు - నీవెవడవు?మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి. 
23  అందుకతడు ప్రవక్తయైన యెషయాచెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. 
24  పంపబడినవారు పరిసయ్యులవారు. 
25  వారు - నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్తవైనను కాకుండినయెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా 
26-27. యోహాను - నేను నీళ్లలోబాప్తిస్మమిచ్చుచున్నాను గాని నావెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు;మీరాయన నెరుగరు, ఆయన చెప్పులవారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. 
28  యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. 
29  మరునాడు యోహాను యేసు తనయొద్దకు రాగాచూచి - ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల. 
30  నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవనిగూర్చి చెప్పితినో ఆయనే యీయన. 
31  నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలోబాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పెను. 
32  మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు - ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను. 
33  నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు - నీవెవనిమీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలోబాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. 
34  ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను. 
35  మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా 
36  అతడు నడుచుచున్న యేసువైపు చూచి - ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. 
37  అతడు చెప్పిన మాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. 
38  యేసు వెనుకకు తిరిగి వారు తన్నువెంబడించుట చూచి - మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారు - రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బియను మాటకు బోధకుడని అర్ధము. 
39  - వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కావురమున్నస్ధలము చూచి ఆ దినమున ఆయనయొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళఆయెను. 
40  యోహాను మాట విని ఆయనను వెంబడించిన. యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ. 
41  ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి - మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి 
42  యేసునొద్దకు అతని తోడుకొనివచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడనిఅర్థము. యేసు అతనివైపు చూచి - నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్ధము. 
43  మరునాడు ఆయన గలిలైయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని - నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. 
44  ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అను వారి పట్టణపు కాపురస్థుడు. 
45  ఫిలిప్పు నతనయేలును కనుగొని - ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవనిగూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసుఅని అతనితో చెప్పెను. 
46  అందుకు నతనయేలు - నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగా - వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. 
47  యేసు నతనయేలు తనయొద్దకు వచ్చుట చూచి - ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను. 
48  - నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు - ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టుక్రింద ఉన్నప్పుడు నిన్ను చూచితినని అతనితో చెప్పెను. 
49  నతనయేలు - బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. 
50  అందుకు యేసు - ఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్పకార్యములు చూతువని అతనితో చెప్పెను. 
51  ķరియు ఆయన - మీరు ఆకాశము తెరుబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 
Download Audio File

యోహాను2వఅధ్యాయము

1  మూడవ దినమున గలిలైయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 
2  యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి. 
3  ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి - వారికి ద్రాక్షారసము లేదని అయనతో చెప్పగా 
4  యేసు ఆమెతో - అమ్మా, నీతో నాకేమి (పని)? నా సమయమింక రాలేదనెను. 
5  ఆయన తల్లిపరిచారకులను చూచి - ఆయన మీతో చెప్పునది చేయుడనెను. 
6  యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరురాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. 
7  యేసు - ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. 
8  అప్పుడాయన వారితో - మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా వారు తీసికొనిపొయిరి. 
9  ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లుముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి 
10  - ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసమును పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసమును ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. 
11  గలిలైయలోని కానాలో యేసు ఈ మొదటి సూచకక్రియనుచేసి తన మహిమను బయలుపరిచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి. 
12  అటుతరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూముకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. 
13  యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్లి 
14  దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి 
15  త్రాళ్లతో కొరడాలు చేసి, గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి 
16  పావురములు అమ్మువారితో -వీటిని ఇక్కడనుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను. 
17  ఆయన శిష్యులు -నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని3 వ్రాయబడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి. 
18  కాబట్టి యూదులు - నీవీ కార్యములు చేయుచున్నావే; యే సూచకక్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా 
19  యేసు - ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. 
20  యూదులు - ఈ దేవాలయము నలువదియారు సంవత్సరముములు కట్టిరే, నీవు మూడు దినములలో దాని లేపుదువా అనిరి. 
21  అయితే ఆయన తన శరీరమను దేవాలయముగూర్చి యీ మాట చెప్పెను. 
22  ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పెన మాటను నమ్మిరి. 
23  ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. 
24  అయితే యేసు అందరిని ఎరిగనవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు 
25  గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు. 
Download Audio File

యోహాను3వఅధ్యాయము

1  యూదుల అధికారియైన నికొదేమను పరిసయ్యుడొకడుండెను. 
2  అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి - బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే కాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. 
3  అందుకు యేసు అతనితో - ఒకడు క్రొత్తగాజన్మించితేనే కాని అతడు దేవునిరాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 
4   అందుకు నికొదేము - ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా 
5  యేసు ఇట్లనెను - ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మింతేనే కాని దేవునిరాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
6  శరీరమూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. 
7  మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 
8  గాలి తన కిష్టమైన చోటను విసురును; నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మంచిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను. 
9  అందుకు నికొదేము - ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా 
10  యేసు ఇట్లనెను - నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైయుండి వీటిని ఎరుగవా? 
11  మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
12  భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు? 
13  మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండుమనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయినవాడెవడును లేడు.  
  14-15. అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవముపొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. 
16  దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుడుగాపుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 
17  లోకము తన కూమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోకి పంపలేదు. 
18  ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. 
19  ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోకివచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 
20  దుష్కార్యముచేయుప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్ క్రియలుగా కనబడకుండునట్లువెలుగునొద్దకు రాడు. 
21  సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చుననెను.  
22  అటుతరువాత యేసు తన శిష్యులతోకూడ యూదైయదేశమునకు వచ్చి, అక్కడ వారితో కాలముగడుపుచు బాప్తిస్మమిచ్చుచుండెను, 
23  సలీము దగ్గెరనున్న ఐనోనను స్ధలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మమిచ్చుచుండెను; జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. 
24  యోహాను ఇంక చెరసాలలో వేయబడియుండలేదు. 
25  శుద్ధీకరణాచారమునుగూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను 
26  గనుక వారు యోహాను నొద్దకు వచ్చి - బోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతోకూడ ఉండెనో, నీవెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. 
27  అందుకు యోహాను ఇట్లనెను - తనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొందనేరడు. 
28  నేను క్రీస్తును కాననియు, అయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. 
29  పెండ్లికుమార్తెగలవాడు పెండ్లికుమారుడు; అయితే నిలువబడి పెండ్లికుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లికుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమైయున్నది. 
30  ఆయన హెచ్చవలసియున్నది నేను తగ్గవలసియున్నది. 
31  పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమినుండి వచ్చువాడు భూసంబంధమైన సంగతులనుగూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చువాడు అందరికి పైగానుండి 
32  తాను కన్నవాటినిగూర్చియు విన్నవాటినిగూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. 
33-34. ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసియున్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలేపలుకును. 
35  తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయనచేతికి సమస్తము అప్పగించి యున్నాడు. 
36  కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు; కుమారునికి విధేయుడు కానివాడు జీవముచూడడు గాని దేవుని యుగ్రత వాని మీద నిలిచియుండును. 
Download Audio File

యోహాను4వఅధ్యాయము

1  యోహానుకంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు. 
2  ఆయన యూదైయదేశమును విడిచి గలిలైయదేశమునకు తిరిగి వెళ్లెను. 
3  అయినను యేసే బాప్తిస్మమియ్యలేదుగాని ఆయన శిష్యులిచ్చుచుండిరి. 
4  ఆయన సమరైయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక 
5  యాకోబు తన కూమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గెరనున్న సమరైయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. 
6  అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాసమువలన అలసియున్నరీతినే ఆ బావియొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు ఆరుగంటలాయెను. 
7  సమరైయ స్త్రీ యెకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు - నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను. 
8  ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోకి వెళ్లియుండిరి. 
9  ఆ సమరైయ స్త్రీ - యూదుడవైన నీవు సమరైయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరైయులతో సాంగత్యము చేయరు. 
10  అందుకు యేసు -నీవు దేవుని వరమును - నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. 
11  అప్పుడా స్త్రీ - అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకుదొరుకును? 
12  తన కుమాళ్లతోను పశ్వాదులతోను తానుకూడ దీని నీళ్లు త్రాగి యీ బావి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. 
13  అందుకు యేసు - ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; 
14  నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవము కలుగుటకై వానిలో ఊరెడి నీటిబుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. 
15  ఆ స్త్రీ ఆయనను చూచి - అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా 
16  యేసు - నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. 
17  ఆ స్త్రీ - నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో - నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే; 
18  నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు నీకున్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను. 
19  అప్పుడా స్త్రీ - అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 
20  మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్ధలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను 
21  - అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతములోనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; 
22  మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది. 
23  అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్నుఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. 1
24  దేవుడు ఆత్మగనుక ఆయనను ఆలాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. 
25  ఆ స్త్రీ ఆయనతో - క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా 
26  యేసు - నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. 
27  ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని - నీకేమి కావలెననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావనియైనను ఎవడును అడుగలేదు. 
28  ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్లి 
29  - మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యునిచూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా 
30  వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిరి. 
31  ఆలోగా శిష్యులు - బోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి. 
32  అందుకాయన - భుజించుటకు మీకు తెలియని ఆహారమునాకు ఉన్నదని వారితో చెప్పగా 
33  శిష్యులు - ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. 
34  యేసు వారిని చూచి - నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది. 
35  ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. యిదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను. 
36  విత్తువాడును కోయువాడునుకూడ సంతోషించునట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. 
37  విత్తువాడొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే. 
38  మీరు దేనిగూర్చి కష్టపడలేదో దాని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టములో ప్రవేశించియున్నారని చెప్పెను. 
39  - నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరైయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి 
40  ఆ సమరైయులు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను. 
41  ఆయన మాటలు వినినందున ఇంక అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి - ఇక మీదట నీవు చెప్పిన మాటనుబట్టి నమ్మము; 
42  మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొన్నామనిరి. 
43  ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలైయకు వెళ్లెను. 
44  ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను. 
45  గలిలైయులుకూడ ఆ పండుగకు వెళ్లువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలైయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. 
46  తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలైయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగియై యుండెను. 
47  యేసు యూదైయనుండి గలిలైయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. 
48  యేసు -సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రమును నమ్మరని అతనితో చెప్పెను. 
49  అందుకా ప్రధాని - ప్రభువా, నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. 
50  యేసు - నీవు వెళ్లుము. నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పినమాట నమ్మి వెళ్లిపోయెను. 
51  అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి అతని కుమారుడు బ్రదికియున్నాడని తెలియజెప్పిరి. 
52  ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు - నిన్న ఒంటిగంటకు జ్వరము వాని విడిచెనని అతనితో చెప్పిరి. 
53  -నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి. 
54  యేసు యూదైయనుండి గలిలైయకు వచ్చి చేసిన సూచకక్రియలలో ఇది రెండవది. 
Download Audio File

యోహాను5వఅధ్యాయము

1  అటుతరువాత యూదుల పండుగ యెకటివచ్చెను గనుక యేసు యెరూషలేముకు వెళ్లెను. 
2  యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గెర, హెబ్రీభాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరుండెను, దానికి అయిదు మంటపములు కలవు. 
3-4. ఆ యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును, గనుక ఆ మంటపములలో వ్యాధిగ్రస్తులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. 
5  అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. 
6  యేసు వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి - స్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా 
7  ఆ వ్యాధిగ్రస్తుడు - అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. 
8  యేసు - నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా 
9  వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను. 
10  ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు - ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొనతగదే అని స్వత్థత నొందినవానితో చెప్పిరి. 
11  అందుకు వాడు - నన్ను స్వస్థపరచినవాడు - నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను. 
12  వారు - నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి. 
13  ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపుకూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను. 
14  అటుతరువాత యేసు దేవాలయములో వాని చూచి - ఇదిగో నీవు స్వస్థతనొందితివి; మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా 
15  వాడు వెళ్లి తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. 
16  ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. 
17  అయితే యేసు -నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. 
18  ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే గాక, దేవుడు తన స్వంత తండ్రి అని చెప్పి, తన్నుదేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. 
19  కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను -తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో అదేకాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును ఆలాగే చేయును. 
20  తండ్రి కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటినెల్లను ఆయనకు అగుపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు ఘనమైన కార్యములను ఆయనకు అగుపరచును. 
21  తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును. 
22  తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని 
23  తండ్రిని ఘనపరుచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. 
24  నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసమంచువాడు నిత్యజీవము గలవాడైయున్నాడు; వాడు తీర్పులోకి రాక మరణములోనుండి జీవములోకి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాచు. 
25  మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది; దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
26  తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. 
27  మరియు ఆయన మనుష్యకుమారుడు గనుక తీర్పు తీర్చుటకును (తండ్రి) ఆయనకు అధికారము అనుగ్రహించెను. 
28  దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని 
29  మేలుచేసినవారు జీవపునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. 
30  నాయంతట నేనే ఏమియు చేయలేను;నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపినవాని చిత్తప్రకారమే చేయ గోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. 
31  నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన పక్షమున నా సాక్ష్యము సత్యము కాదు. 
32  నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు; ఆయన నన్నుగూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని యెరుగుదును. 
33  మీరు యోహానునొద్దకు (కొందరిని) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. 
34  నేను మనుష్యులవలన సాక్ష్యమంగీకరంపను గాని మీరు రక్షింపబడవలెనని యీ మాటలు చెప్పుచున్నాను. 
35  అతడు ప్రజ్వలించుచు ప్రకాశించుచున్న దీపమై యుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. 
36  అయితే యోహాను సాక్ష్యముకంటె నాకెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నాకిచ్చియున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 
37  మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన శబ్దము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు. 
38  ఆయన ఎవని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు. 
39  లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు; అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 
40  అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు. 
41  నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను. 
42  నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు. 
43  నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను; మీరు నన్ను అంగీకరింపరు; మరియొకడు తన నామమున వచ్చిన పక్షమున వానిని అంగీకరింతురు. 
44  అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పును కోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి; 
45  మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపువాడు. 
46  అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్లయిన నన్నును నమ్ముదురు. 
47  మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను. 
Download Audio File

యోహాను6వఅధ్యాయము

1  అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలైయ దాటి అద్దరికి వెళ్లెను. 
2  రోగులయెడల ఆయన చేసిన సూచకక్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి 
3  యేసు కొండెక్కి అక్కడ తన శిష్యులతోకూడ కూర్చుండెను 
4  అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. 
5  కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచి - వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని 
6  యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతని శోధించుటకు ఆలాగడిగెను. 
7  అందుకు ఫిలిప్పు - వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను ఇన్నూరు దేనారములరొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను 
8  ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ 
9  - ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలును రెండు చిన్న చేపలును ఉన్నవిగాని, యింతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా 
10  యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక యుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదు వేల పురుషులు కూర్చుండిరి. 
11  యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను; ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. 
12  వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. 
13  కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పన్నెండు గంపెళ్లు నింపిరి. 
14  ఆ మనుష్యులు యేసు చేసిన సూచకక్రియను చూచి - నిజముగా ఈ లోకమునుక రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. 
15  రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను. 
16  సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్లి దోనె ఎక్కి సముద్రపు అద్దరికి కపెర్నహూముకు పోవుచుండిరి. 
17  అంతలో చీకటాయెను గాని యేసు వారియొద్దకు ఇంక రాలేదు. 
18  అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. 
19  వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గెరకు వచ్చుట చూచి భయపడిరి; 
20  అయితే ఆయన - నేనే, భయపడకుడని వారితో చెప్పెను. 
21  అంతట ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారికిష్టమాయెను. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న దేశమునకు చేరెను. 
22  మరునాడు సముద్రపు అద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా, ఒక చిన్నదోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులుమాత్రమే వెళ్లిరనియు తెసికొనిరి. 
23  అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పురడు వారు రొట్టె భుజించిన చోటుకు దగ్గెరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను. 
24  కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూముకు వచ్చిరి. 
25  సముద్రపు అద్దిరిని ఆయనను కనుగొని - బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా 
26  యేసు - మీరు సూచకక్రియలను చూచుటవలన కాదు, రొట్టెలు భుజించి తృప్తిపొందుటవలననే నన్ను వెదుకుచున్నారని మీతో నీశ్చయముగా చెప్పుచున్నాను. 
27  క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దాని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను. 
28  వారు - మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా 
29  యేసు - ఆయన పంపినవానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. 
30  వారు - అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచకక్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? 
31  భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అనివ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. 
32  కాబట్టి యేసు - పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు. 
33  పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. 
34  కావున వారు - ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడు మాకు అనుగ్రహించుమనిరి. 
35  అందుకు యేసు వారితో ఇట్లనెను - జీవాహారము నేనే; నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. 
36  మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని. 
37  తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువాని నేనెంతమాత్రమును బయటికి తోసివేయను. 
38  నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని. 
39  ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో నేనేమియు పోగొట్టకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమై యున్నది. 
40  కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వాని లేపుదును. 
41  నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు - 
42  ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? - నేను పరలోకమునుండి దిగి వచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి. 
43  అందుకు యేసు - మీలో మీరు సణుగుకొనకుడి; 
44  నన్ను పంపిన తండ్రి ఆకర్షించితేనే గాని యెవడును నాయొద్దకు రాలేడు; అంత్యదినము నేను వాని లేపుదును. 
45  - వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును. 
46  దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు.  
47-48. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే 
49  మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. 
50  ప్రతివాడును తిని చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే. 
51  పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 
52  యూదులు - ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. 
53  కావున యేసు ఇట్లనెను - మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. 
54  నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వాని లేపుదును. 
55  నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. 
56  నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. 
57  జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రిమూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. 
58  ఇదే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు (మన్నాను ) తినియు చనిపోయినట్టుకాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
59  ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను. 
60  ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని - యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 
61  యేసు తన శిష్యులు దీనిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను - దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? 
62  అలాగైతే మీరు మనుష్యకుమారుడు మునుపున్నచోటుకు ఎక్కుట చూచినయెడల ఏమందురు? 
63  ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ ప్రయోజనము. నేను మీతో చెప్పియున్నమాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని 
64  మీలో విశ్వసించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసుకు తెలియును. 
65  మరియు ఆయన - తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను. 
66  అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. 
67  కాబట్టి యేసు - మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా అని పన్నెండుమందిని అడుగగా 
68  సీమోను పేతురు - ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; 
69  నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను. 
70  అందుకు యేసు - నేను పన్నెండుగురైన మిమ్మును ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు అపవాది అని వారితో చెప్పెను. 
71  సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా పన్నెండుమందిలో ఒకడైయుండి ఆయననప్పగింపబోవుచుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. 
Download Audio File

యోహాను7వఅధ్యాయము

1  అటుతరువాత యూదులు ఆయనను చంపయత్నించినందున యేసు యూదైయలో సంచరించనొల్లక గలిలైయలో సంచరించుచుండెను. 
2  యూదుల పండుగైన పర్ణశాలలపండుగ సమీపించెను గనుక 
3  ఆయన సహోదరులు ఆయనను చూచి - నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదైయకు వెళ్లుము. 
4  బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమునజరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనపరచుకొనుమని చెప్పిరి. 
5  ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు. 
6  యేసు - నా సమయమింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది. 
7  లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని, దాని క్రియలు చెడ్డవని నేను దానిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. 
8  మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణము కాలేదుగనుక నేను ఈ పండుగకు ఇంకను వెళ్లనని వారితో చెప్పెను. 
9  ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలైయలో నిలిచిపోయెను. 
10  అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయనకూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను. 
11-12. పండుగలో యూదులు - ఆయన ఎక్కడనని ఆయననుగూర్చి గొప్ప సణుగుపుట్టెను; కొందరాయన మంచివాడనిరి; మరికొందరు - కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి; 
13  అయితే యూదులకు భయపడి ఆయననుగూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు. 
14  సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోకి వెళ్లి భోధించుచుండెను. 
15  యూదులు అందుకు ఆశ్చర్యపడి - చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి. 
16  అందుకు యేసు - నేను చేయుబోధ నాది కాదు నన్ను పంపినవానిదే. 
17  ఎవడైన ఆయన చిత్తముచొప్పున చేయగోరినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో లేక నా యంతట నేనే బోధించుచున్నానో వాడు తెలిసికొనును. 
18  తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దర్ణీతియు లేదు. 
19  మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను. 
20  అందుకు జనసమూహము - నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా 
21  యేసు వారిని చూచి -నేను ఒక కార్యముచేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడుచున్నారు. 
22  మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. 
23  మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతిదినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతిదినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగలవానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడుచున్నారేమి? 
24  వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. 
25  యెరూషలేమువారిలో కొందరు - వారు చంపయత్నించువాడు ఈయనే కాడా; 
26  ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా? 
27  అయినను ఈయన ఎక్కడివాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన ఎక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుచుండిరి. 
28  కాగా యేసు దేవాలయములో బోధించుచు -మీరునన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నాయంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. 
29  నేను ఆయనయొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనయొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను. 
30  అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింక రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. 
31  మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచి - క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటికంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. 
32  జనసమూహము ఆయననుగూర్చి యీలాగు సణుగుకొనుట పరసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యలును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. 
33  యేసు -ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును : తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును; 
34  మీరు నన్ను వెదుకుదురు గాని నన్నుకనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరురాలేరనెను. 
35  అందుకు యూదులు - మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? హెల్లేనీయులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి హెల్లేనీయులకు బోధింప బోవుచున్నాడా? 
36  - నన్ను వెదుకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి. 
37  ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి - ఎవడైన దప్పిగొనిన యెడల నాయెద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 
38  నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టువాని కడుపులోనుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. 
39  తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంక మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు. 
40  జనసమూహములో కొందరు ఈ మాటలు విని - నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి; 
41  మరికొందరు - ఈయన క్రీస్తే అనిరి; మరికొందరు - ఏమి? క్రీస్తు గలిలైయలోనుండి వచ్చునా? 
42  క్రీస్తు దావీదు సంతానములోపుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. 
43  కాబట్టి ఆయననుగూర్చి జనసమూహములో భేదము పుట్టెను. 
44  వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు. 
45  ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరిసయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారు - ఎందుకు మీరాయనను తీసికొని రాలేదని అడుగగా 
46  ఆ బంట్రౌతులు - ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. 
47  అందుకు పరిసయ్యులు - మీరుకూడ మోసపోతిరా? 
48  అధికారులలోగాని పరసయ్యులలోగాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? 
49  అయితే ధర్మశాస్త్రమెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. 
50  ఆయనయొద్దకు వచ్చిన నికొదేము వారిలో ఒకడైయుండెను. 
51  అతడు - ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనకమునుపును, మన ధర్మశాస్త్రము వానికి తీర్పు తీర్చునా అని అడుగగా 
 52-53. వారు - నీవును గలిలైయుడవా? విచారించి చూడుము, గలిలైయులో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. 
అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి

యోహాను8వఅధ్యాయము

1  యేసు ఒలీవలకొండకు వెళ్లెను.
2  తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోకి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. 
3  శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొవచ్చి ఆమెను మధ్యనిలువబెట్టి 
4  -బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారముచేయుచుండగా పట్టబడెను; 
5  అట్టివారిని రాళ్లు రువ్విచంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి 
6  ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో (ఏమో) వ్రాయుచుండెను. 
7  వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి -మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి 
8  మరల వంగి నేలమీద వ్రాయుచుండెను 
9  వారామాట విని, 1పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకనివెంట ఒకడు బయటికి వెళ్లిరి యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడి యుండెను. 
10  యేసు తలయెత్తి చూచి - అమ్మా, వారెక్కడనున్నారు?; ఎవడును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు 
11  ఆమె - లేదు ప్రభువా అనెను. అందుకు యేసు - నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్లి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. 
12  మరియు యేసు - నేను లోకమునకు వెలుగునైయున్నాను; నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలవాడై యుండునని వారితో చెప్పెను. 
13  కాబట్టి పరిసయ్యులు - నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా 
14  యేసు - నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే, నేను ఎక్కడినుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు. 
15  మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవనికిని తీర్పు తీర్చను. 
16  నేను ఒక్కడనైయుండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడనున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. 
17  మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా. 
18  నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యనిచ్చుచున్నాడని చెప్పెను. 
19  వారు - నీ తండ్రి యెక్కడనున్నాడని ఆయనను అడుగగా యేసు - మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగియుంటిరా నా తండ్రినికూడ ఎరిగియుందురని వారితో చెప్పెను. 
20  ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింక రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. 
21  మరియొకప్పడు ఆయన -నేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనేయుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. 
22  అందుకు యూదులు - నేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పచున్నాడే; తన్నుతానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. 
23  అప్పుడాయన - మీరు క్రిందివారు, నేను పైనుండువాడను, మీరు ఈ లోకసంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను. 
24  కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించినయెడల మీరు మీ పాపములలోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను. 
25  కాబట్టి వారు - నీవెవడవని ఆయన నడుగగా యేసు వారితో - మొదటినుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. 
26  మిమ్మనుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును అనేక సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. 
27  తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. 
28  కావున యేసు -మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియుచేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. 
29  నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయువాడను గనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదని చెప్పెను. 
30  ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి. 
31  కాబట్టి యేసు తనయందు విశ్వాసముంచిన యూదులతో -మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యము గ్రహించెదరు; 
32  ఆప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా 
33  వారు - మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమైయుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. 
34  అందుకు యేసు - పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
35  దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారుడెల్లప్పుడును నివాసముచేయును. 
36  కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. 
37  మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుకు నన్ను చంప వెదుకుచున్నారు. 
38  నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆ ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. 
39  అందుకు వారు ఆయనతో - మా తండ్రి ఆబ్రాహామనిరి; యేసు - మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. 
40  దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్నుమీరిప్పుడు చంప వెదుకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు. 
41  మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు - మేము వ్యభిచారమువలన పుట్టినవారముకాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా 
42  యేసు వారితో ఇట్లనెను- దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్నుపంపెను. 
43  మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననే గదా? 
44  మీరు మీ తండ్రియగు అపవాది 1సంబంధులు, మీ తండ్రి దరాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు. 
45  నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్నునమ్మరు. 
46  నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్ధాపించును? నేను సత్యము చెప్పుచున్న పక్షమున మీరెందుకు నన్ను నమ్మరు? 
47  దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. 
48  అందుకు యూదులు - నీవు సమరైయుడవును దయ్యము పట్టినవాడవునై యున్నావని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా. 
49  యేసు - నేను దయ్యము పట్టినవాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు. 
50  నేను నా మహిమను వెదకుటలేదు, వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. 
51  ఒకడు నా మాటగైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడనిమీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. 
52  అందుకు యూదులు -నీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగుదుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను - ఒకడు నా మాటగైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు. 
53  మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్నునీ వెవడనని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి. 
54  అందుకు యేసు -నన్ను నేనే మహిమపరుచుకొనినయెడల నా మహిమ వట్టిది; - మా దేవుడని మీరెవనిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. 
55  మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగదును, ఆయన మాట గైకొనుచున్నాను. 
56  మీ తండ్రియైన అబ్రాహాము నా దినముచూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను, అందుకు యూదులు - నీకింక ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, 
57  యేసు - అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 
58  కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లను ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను. 
59   కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లను ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను. 
Download Audio File

యోహాను9వఅధ్యాయము

1  ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. 
2  ఆయన శిష్యులు - భోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసేను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా 
3  యేసు - వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదుగాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. 
4  పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. 
5  నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగైయున్నానని చెప్పెను. 
6  ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురదపూసి 
7  -నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమును మాటకు పంపబడినవాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. 
8  కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారును - వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనువాడు కాడా అనిరి. 
9  వీడే అని కొందరును; వీడు కాడు, వీని పోలియున్నయొకడని మరికొందరును అనిరి; వాడైతే - నేనేయనెను. 
10  వారు - నీ కన్నులేలాగు తెరువబడెనని వానినడుగగా 
11  వాడు - యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి - నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను. 
12  వారు - ఆయన ఎక్కడనని అడుగగా వాడు - నేనెరుగననెను. 
13  అంతకుముందు  గ్రుడ్డియై యుండినవానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసికొనిపోయిరి. 
14  యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము 
15  వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులుకూడ వానిని మరల అడుగగా వాడు - నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను. 
16  కాగా పరిసయ్యులలో కొందరు - ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరిచుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు - పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియలేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను. 
17  కాబట్టి వారు ఆ గుడ్డివానితో - అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమనుకొనుచున్నావని యడుగగా వాడు - ఆయన ఒక ప్రవక్త అనెను. 
18 వాడు గ్రుడ్డివాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి, 
19   గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి.  
20  అందుకు వాని తలిదండ్రులు - వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. 
21  ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. 
22  వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; యెందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలివేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొనియుండిరి. 
23  కావున వాని తలిదండ్రులు - వాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి. 
24  కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి - దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా 
25  వాడు - ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాననెను. 
26  అందుకు వారు - ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా 
27  వాడు - ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను. 
28  అందుకు వారు - నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము; 
29  దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడినుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి. 
30  అందుకు ఆ మనుష్యుడు - ఆయన ఎక్కడనుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను. 
31  దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును. 
32  పుట్టు గుడ్డివాని కన్నులెవడైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. 
33  ఈయన దేవునియొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను. 
34  అందుకు వారు - నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. 
35  (పరిసయ్యులు) వానిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని - నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. 
36  అందుకు వాడు - ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా 
37  యేసు -నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. 
38  అంతట వాడు - ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. 
39  అప్పుడు యేసు - చూడనివారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను, అను తీర్పునిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను. 
40  ఆయనయొద్దనున్న పరసయ్యులలో కొందరు ఈ మాట విని - మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. 
41  అందుకు యేసు - మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవునుగాని - చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొను చున్నారు గనుక మీ పాపము నిలిచి యున్నదని చెప్పెను. 
Download Audio File

యోహాను10వఅధ్యాయము

1  గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు. 
2  ద్వారమున ప్రవేశించువాడు గొర్రెలకాపరి. 
3  అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని శబ్దము వినును, అతడు స్వకీయమైన గొర్రెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలపలికి నడిపించును. 
4  మరియు అతడు స్వకీయమైన గొర్రెలనన్నిటిని వెలపలికి నడిపించునప్పుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొర్రెలు అతని శబ్దమెరుగును గనుక అవి అతని వెంబడించును. 
5  అన్యుల శబ్దము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాని వారితో అనెను. 
6  ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. 
7  కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను 
8  - గోర్రెలు పోవు ద్వారము నేనే : నాకు ముందు వచ్చినవారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొర్రెలు వారి శబ్దము వినలేదు. 
9  నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. 
10  దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
11  నేను గొర్రెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొర్రెలకొరకు తన ప్రాణము పెట్టును. 
12  జీతగాడు గొర్రెల కాపరికాడు గనుక గొర్రెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును; తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. 
13  జీతగాడు జీతగాడే గనుక గొర్రెలునుగూర్చి లక్ష్యముచేయక పారిపోవును.  
14-15. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 
16  ఈ దొడ్డివికాని వేరే గొర్రెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా శబ్దమువినును, అప్పుడు మంద యొక్కటియు గొర్రెల కాపరి యొక్కడును అగును. 
17  నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 
18  ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. 
19  ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను. 
20  వారిలో అనేకులు - వాడు దయ్యము పట్టినవాడు వెర్రివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. 
21  మరికొందరు - ఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గుడ్డివారి కన్నులు తెరువగలదా అని చెప్పిరి. 
22  ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను. 
23  అది శీతకాలము అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా 
24  యూదులు ఆయనచుట్టు పొగై - యెంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. 
25  అందుకు యేసు -మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు; నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 
26  అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు. 
27  నా గొర్రెలు నా శబ్దము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. 
28  నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. 
29  వాటిని నాకిచ్చిన నా తండ్రిచేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు; 
30  నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను. 
31  యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లు చేత పట్టుకొనగా 
32  యేసు - తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. 
33  అందుకు యూదులు - నీవు మనుష్యుడవైయుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. 
34  అందుకు యేసు - మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?
35  లేఖనము నిరర్థకము కానేరదు గదా; దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల - నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, 
36  తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోకి పంపినవానితో - నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? 
37  నేను నా తండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి, 
38  చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. 
39  వారు మరల ఆయనను పట్టుకొన చూచిరిగాని ఆయన వారి చేతినుండి తప్పించుకొనిపోయెను. 
40  యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను. 
41  అనేకులు ఆయనయొద్దకు వచ్చి - యోహాను ఏ సూచకక్రియను చేయలేదు గాని యీయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైనవనిరి. 
42  అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. 
Download Audio File

యోహాను11వఅధ్యాయము

1  మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగియాయెను. 
2  ఈ లాజరు ప్రభువుకు అత్తరు వూసి తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. 
3  అతని అక్కచెల్లెండ్లు - ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియైయున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి. 
4  యేసు అది విని - యీ వ్యాధి మరణార్థమై వచ్చినది కాదు గాని దేవుని కూమారుడు దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమార్థమై వచ్చినదనెను. 
5  యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. 
6  అతడు రోగియైయున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండుదిములు నిలిచెను. 
7  అటుపిమ్మట ఆయన - మనము యూదైయకు తిరిగి వెళ్లుదుమని తన శిష్యులతో చెప్పగా 
8  ఆయన శిష్యులు - బోధకుడా, యిప్పుడే యూదులు నిన్నురాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి. 
9  అందుకు యేసు - పగలు పన్నెండు గంటలున్నవి గదా; ఒకడు పగటివేళ నడిచినయెడల ఈ లోకపు వెలుగును చూచును గనుగ తొట్రుపడడు. 
10  అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. 
11  ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత - మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా 
12  శిష్యులు - ప్రభువా, అదడు నిద్రించినయెడల బాగుపడుననిరి. 
13  యేసు అతని మరణమును గూర్చి చెప్పెనను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. 
14 -15. కావున యేసు - లాజరు చనిపొయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదుము రండని స్పష్టముగా వారితో చెప్పెను. 
16  అందుకు దిదుమ అనబడిన తోమా - ఆయనతో కూడ చనిపొవుటకు మనమును వెళ్లుదమని తనతోటి శిష్యులతో చెప్పెను. 
17  యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను. 
18  బేతనియ యెరూషలేముకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము 
19  గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను పరామర్శించుటకై వారియొద్దకు వచ్చియుండిరి. 
20  మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్లెను గాని మరియు యింటిలో కూర్చుండియుండెను. 
21  మార్త యేసును చూచి - ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. 
22  ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని యెరుగుదుననెను. 
23  యేసు - నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా 
24  మార్త ఆయనను చూచి - అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను. 
25  అందుకు యేసు -నేనే పునరుత్థానమును జీవమునై యున్నాను; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; 
26  బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెనడిగెను. 
27  , ఆమె - అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్మచున్నానని ఆయనతో చెప్పెను. 
28  ఆమె యీ మాట చెప్పి వెళ్లి తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను. 
29  ఆమె విని త్వరగా లేచి ఆయనయొద్దకు వచ్చెను. 
30  యేసు ఇంక ఆ గ్రామములోకి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనేయుండెను 
31  గనుక యింటిలో మరియతో కూడనుండి ఆమెను పరామర్శంచుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి. 
32  అంతట మరియ యేసు ఉన్నచోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదములమీద పడి - ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను. 
33  ఆమె యేడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు - అతని నెక్కడనుంచితిరని అడుగగా, 
34  వారు - ప్రభువా, వచ్చిచూడుమని ఆయనతో చెప్పిరి. 
35  యేసు కన్నీళ్లు విడిచెను. 
36  కాబట్టి యూదులు - అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. 
37  వారిలో కొందరు - ఆ గుడ్డివాని కన్నులు తెరచినవాడైన యీయన యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి. 
38  యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. 
39  యేసు - రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త - ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. 
40  అందుకు యేసు - నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; 
41  అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి - తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 
42  నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారినిమిత్తమై యీ మాట చెప్పితిననెను. 
43  ఆయన ఆలాగు చెప్పి - లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా 
44  చనిపోయినవాడు కాళ్లు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడినవాడై వెలిపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు - మీరు అతిని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను. 
45  మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి కాని 
46  వారిలో కొందరు పరిసయ్యులయొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. 
47  కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చి - మనమేమి చేయుచున్నాము? ఈ మనష్యుడు అనేకమైన సూచకక్రియలు చేయుచున్నాడే 
48  మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులువచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. 
49  అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై యుండి - మీకేమియు తెలియదు. 
50  (మన) జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. 
51  తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక 
52  యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకుమాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను. 
53  కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి. 
54  కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడినుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతోకూడ నుండెను. 
55  మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలోనుండి యెరుషలేముకు వచ్చిరి. 
56  వారు యేసును వెదుకుచు దేవాలయములో నిలువబడి - మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. 
57  ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న పక్షమున తాము ఆయనను పట్టుకొనగలందులకై తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి. 
Download Audio File

యోహాను12వఅధ్యాయము

1  మృతులలోనుండి యేసుచేత లేపబడిన లాజరు ఉన్న బేతనియకు యేసు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకొరకు విందు చేసిరి. 
2  మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతోకూడ భోజనమునకు కూర్చున్నవారిలో ఒకడు. 
3  అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నరయెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. 
4  ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా 
5  - యీ అత్తరెందుకు మున్నూరు దేనారములుకు అమ్మిబీదలకు ఇయ్యలేదనెను. 
6  వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచి యుంచుకొని ఆందులో వేయబడినది ఎత్తికొని పోవుచువచ్చెను గనుక ఆలాగు చెప్పెను. 
7  కాబ్బట్టి యేసు - నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి; 
8  బీదలు ఎల్లప్పుడును మీతో కూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను. 
9  యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి లేపిన లాజరునుకూడ చూడవచ్చిరి. 
 10-11. అతని చూచిన యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధానయాజకులు లాజరునుకూడ చంపనాలోచనచేసిరి. 
12  మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని 
13  ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి - జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని కేకలువేసిరి. 
14  - సీయోను కుమారీ భయపడకుము, ఇదిగో నీ రాజు 
15  గాడిదె పిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడుఅని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదెను కనుగొని దానిమీద కూర్చుండెను. 
16  ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయననుగూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. 
17  ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలోనుండి అతని లేపినప్పుడు ఆయనతోకూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. 
18  అందుచేత ఆయన ఆ సూచకక్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. 
19  కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు - మన ప్రయత్నములెట్లు నిష్ ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి. 
20  ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు హెల్లెనీయులుండిరి. 
21  వారు గలిలైయలోని బేత్సయిదావాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి - అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా 
22  ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. 
23  అందుకు యేసు వారితో ఇట్లనెను - మనుష్యకుమారుడు మహిమపొందవలసిన గడియ వచ్చియున్నది. 
24  గోధుమగింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగనేయుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును. 
25  తన ప్రాణమును ప్రేమించువాడు దాని నశింపజేయువాడు; ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవార్థమై దాని కాపాడువాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
26  ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించియెడల నా తండ్రి అతని ఘనపరచును. 
27  ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును? - తండ్రీ, యీ గడియ నాకు తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని; 
28  తండ్రీ, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట - నేను దాని మహిమపరచితిని, మరల మహిమపరతును అను నొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. 
29  కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము - ఉరిమెను అనిరి. మరికొందరు - దేవదూత యొకడు ఆయనతో మాటలాడెననిరి. 
30  అందుకు యేసు - ఈ శబ్దము నాకొరకు రాలేదు మీకొరకే వచ్చెను. 
31  ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది; ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు తోసివేయబడును; 
32  నేను భూమిమీదనుండి పైకెత్తబడినప్పుడు అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. 
33  తాను ఏ విధముగా మరణము పొందవలసియుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. 
34  జనసమూహము - క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. - మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్యకుమారుడగు ఈయన ఎవడని ఆయన నడిగిరి. 
35  అందుకు యేసు - ఇంక కొంతకాలము వెలుగు మీమధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు కలిగియున్న వెలుగు కొలది నడువుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు. 
36  మీరు వెలుగు సంబంధులగునట్లుమీకు కలిగియున్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. 
37  యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారియెదుట ఇన్ని సూచకక్రియలుచేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి. 
38  - ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువుయొక్కబాహువు ఎవనికి బయలు పరచబడెను?అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. 
39-40. ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా -వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొనినావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వముకలుగజేసి వారి హృదయము కఠినపరచెను 
41  అని యెషయా మరియొక చోట చెప్పెను. 1యెషయా ఆయన మహిమను చూచినందునఆయననుగూర్చి బోధించుచు ఈ మాటలు చెప్పెను. 
42  అధికారులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి గాని సమాజములోనుండి వెలివేయబడుదుమేమోయని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. 
43  వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. 
44  అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను - నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. 
45  నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు. 
46  నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. 
47  ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన పక్షమున నేనతనికి తీర్పు తీర్చను; నేను లోకమును రక్షించుటకే వచ్చితినిగాని లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. 
48  నన్ను నిరాకనించి నా మాటలను అంగీకరింపనివానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. 
49  ఏలయనగా నాయంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ ఇచ్చియున్నాడు. 
50  మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెను. 
Download Audio File

యోహాను13వఅధ్యాయము

1  తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకుముందే యెరిగినవాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి వారిని సంపూర్ణముగాప్రేమించెను. 
2  వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాదియింతకుముందు ఆలోచన పుట్టించి యుండెను గనుక 
3  తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసియున్నదనియు యేసు ఎరిగి 
4  భోజనపంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుముకు కట్టుకొనెను. 
5  అంతట పళ్లెములో నీళ్లుపోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. 
6  ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు - ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. 
7  అందుకు యేసు -నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా 
8  పేతురు - నీవెన్నడును నా పాదములు కడుగరాదని అయనతో అనెను. అందుకు యేసు - నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను. 
9  సీమోను పేతురు - ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను. 
10  యేసు అతని చూచి - స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పనిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను. 
11  తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక - మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను. 
12  వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత ఆయన మరల కూర్చుండి - నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? 
13  బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను మీకు బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. 
14  కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరు ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. 
15  నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. 
16  దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, అపొస్తలుడుతన్ను పంపినవానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
17  ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు. 
18  మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును కాని- నాతోకూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తెనుఅను లేఖనము నెరవేరుటకై (యీలాగు జరుగును. ) 
19  జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగకమునుపు మీతో చెప్పుచున్నాను. 
20  నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 
21  యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి - మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను 
22  ఆయన ఎవనిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులుసందేహపడుచు ఒకరితట్టు ఒకరు చూచుకొనుచుండగా 
23  ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను 
24  గనుక ఎవనిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగచేసెను. 
25  అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు - ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. 
26  అందుకు యేసు -నేనొక ముక్క ముంచి యెవనికిచ్చెదనో వాడే అని చెప్పి, యొక ముక్కముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను; 
27  వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు - నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా 
28  ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు. 
29  డబ్బుసంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటిని కొనుమనియైనను, బీదలకేమైన ఇమ్మనియైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి. 
30  వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ. 
31  వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను - ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవుడును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు. 
32  దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును. 
33  పిల్లలారా, యింక కొంతకాలము మీతోకూడ ఉందును; మీరు నన్ను వెదుకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను. 
34  మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్తఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకని నొకడు ప్రేమింపవలెను. 
35  మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను. 
36  సీమోను పేతురు - ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావని ఆయనను అడుగగా యేసు - నేను వెళ్లుచున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని యిటుతరువాత వచ్చెదవని అతనితో చెప్పెను. 
37  అందుకు పేతురు - ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంటరాలేను? నీకొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా 
38  యేసు - నాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 
Download Audio File